Please also visit our website
www.chandippatemple.com
ఈ మహాలయ ప్రాంగణం లో ఉన్న శిలా శాసనం ప్రకారం పశ్చిమ చాళుక్య వంశ రాజులలో సుప్రసిద్ద
చక్రవర్తి శ్రీ త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడు ( క్రీ.శ.1076 నుండి 1126 వరకు ) పరిపాలనను సాగించెను.
ఈ మహా రాజు తన పరిపాలనలో భాగంగా, తన అతి విశాల భూభాగా సామ్రాజ్యమందు నిత్య భూదాన వశాత్, చందిప్ప గ్రామమును వేదపారంగతులైన భూసురులకు (బ్రాహ్మణులకు) అగ్రహారంగా ప్రకటించి, ఈ గ్రామ సీమ యందు గల సమస్త భూమిని ఆ అగ్రహారమునకు, అక్కడి మహాజనులకు, పురజనులకు మరియు అక్కడ వేద విద్యనభ్యసించు, విద్యార్థుల మరియు అధ్యాపకుల భోజన వసతులకు, స్థానపతి జీతభత్యాల కొరకు మరియు అక్కడ ఒక సోమేశ్వరాలయ స్థాపనకు, ఆ దేవుని అంగరంగ భోగములకు, విశేష పూజలకు, ఆలయ నిర్వాహణ, రథోత్సవ, శివరాత్రి మొదలగు దైవ కార్యక్రములకు గాను పశ్చిమ దిశలో "హెబ్బి హొలు" అను పేరు గల పొలములో 153 ఎకరాలు నల్ల రేగడి భూమి ని, మరియు దేవుని నైవేద్యమునకు గాను "హరియ కట్టె" లో తూర్పు దిశగా 2-20 ఎకరాల నీరావరి (వరి) భూమిని మరియు, ఆ మహా దేవుని నిత్య పూజకు, పూదోటకు గాను దేవాలయ దక్షిణ దిశగా ఒక మత్తరు భూమిని, మరియు తూర్పున గల మాతంగి పొలమును దేవలాయానికి ధారదత్తము చేయడమైనది. కావున ఇట్టి దేవ మన్యాన్ని అక్కడి గ్రామ ప్రజలు, గ్రామ ప్రభువు రక్షించాలని ఆదేశం.
ఇంతే గాక దేవుని నిత్య నంద దీపమునకు ఒక నువ్వుల గానుగను మరియు మహా నైవేద్యమునకు ఉత్తర దిక్కునగల 54 ఎకరాల తాటి వనమును దైవ మాన్యముగా అర్పించడం జరిగినది.
స్వస్తి మహా సకల అధ్యయన, అధ్యాపన స్వాధ్యాయ, ధ్యాన, ధారణ, మౌన, అనుష్టాన, జప, హోమ, సమధి, శీల సంపన్నులైన బ్రహ్మనోత్తములైన స్థానాపత జ్యోతిష్కుడు _________ భట్టాచార్యుడుగా నియమించి, శ్రీమచ్ఛాలుక్య విక్రమ కాలపు (1101 A.D.) విక్రమాదిత్యుడు పట్టాభిశక్తులైన 25వ సంవత్సరం లో, విషు నామ సంవత్సరమున కార్తీక మాసము నందున శుక్ల పక్ష పంచమి తిధి బృహస్పతి వారము రోజున అనగా విక్రమ శకం 1101A.D., అక్టోబరు నెల, 23వ తేది గురు వారము నాడు సోమేశ్వర లింగ ప్రథిష్ట గావించి, జక్కణబ్బె నామ ధేయురాలైన శివ భక్త శిరోమణి ధర్మము చేయగా ఆలయ నిర్మాణమునకు మరువోజనుని పుత్రుడు తమ్మోజన సోదరుడు ఆలయ నిర్మాణమును గావించారు.
11 వ శతాబ్దపు కాలపు చాళుక్య వంశ రాజులు స్థాపించిన ఈ శివాలయం చరిత్రను ప్రాముఖ్యతను శక్తిని ఈ శిలాశాసనం తెలుపుతుంది.
అలాగే ఈ ఆలయానికి చెందిన 254 ఎకరాల గుడి మాన్యం వివరాలను మరియు వాటిని ఎవరు? ఎలా? ఉపయోగించి, ఈ గుడిని రక్షించి అభివృద్ధి పరుచవలేనో కూడా తెలియ పరచి వున్నట్లు, ఈ లిపిని అనువదించిన పండితులు శ్రీ దేశ్ ముఖ్ హనుమంత్ రెడ్డి గారు తెలియ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ భూములన్నీ సరైన ఆదరణ లేక అన్యాక్రాతం కాబడినవి.
వెయ్యేళ్ళుగా ఈ ఆలయాన్ని సురక్షితంగా కాపాడి రక్షించింది, క్షేత్ర పాలకుడుగా వున్న ఈ కాళభైరవ స్వామే నని పండితులు పేర్కొనడం జరిగింది.....
"కాళభైరవా నమోస్తుతే - కపిలీశ్వరా నమోస్తుతే - కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే"
అని నిత్యం పఠిస్తే బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు ఈ కాళభైరవుడు.
తరుచుగా ఈ ఆలయాన్ని దర్శిస్తూ వుండే శంకర్ పల్లి గ్రామ వాస్తవ్యుడు మరియు ఆంధ్రభూమి రిపోర్టరైన భక్తుడు శ్రీ నరేష్ కుమార్ (సతీష్ కుమార్) శిథిలావస్తకు చేరుకున్న ఈ ఆలయాన్ని చూసి, దీన్ని ఎలాగైనా పునర్మింప చేయాలన్న ధృఢసంకల్పం తో "ధూప దీప నైవేద్యాలకు దూరమైన చందిప్ప మరకత శివలింగం" అనే శీర్షికను ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురించడం జరిగింది. దీనికి స్పందించిన ఖైరతాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ లలిత్ కుమార్ అతనితో పాటు ప్రముఖ సినీ నటులు శ్రీ తనికెళ్ళ భరణి మరియు అతని భందువులు శ్రీ సీతా మహా లక్ష్మి , కళ్యాణీ లు, నరేష్ కుమార్ ఆద్వర్యం లో ఈ మహాలయన్ని దర్శించి పూజలు అభిషేకాలు నిర్వహించారు.ఆ నాటి వారి ప్రేరణ తో 2007సం. నుండి 2011 వరకు అనగా 5 సంవత్సరాలుగా ప్రతీ పౌర్ణమికి స్మామి వారిని దర్శిస్తూ వారికీ అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ వచ్చారు. ఈ కాల క్రమం లో ఒకానొక శుభ ముహూర్తాన ఆ మహా దేవుని సంకల్పం తో నరేష్ కుమార్ గొప్ప దాత మరియు దైవ భక్తుడైన శ్రీ వెంకటేశ్వర్ రావు గారిని అనుకోకుండా 2011 డిసెంబర్ 11 మంగళ వారము నాడు శంకర్ పల్లి అయ్యప్ప మహా పడి పూజోత్సవం లో కలసి చందిప్ప మరకత శివలింగ స్వామి గురించి ఆయన మహత్యం గురించి సవివరంగా తెలియ పరుచగా దైవ భక్తితో ఉప్పొంగిన ఆ భక్తుడు అనతి కాలంలోనే ఈ మహాలయాన్ని సకుటుంబ సతీ సమేతంగా దర్శించి ఎంతో భక్తి తో స్వామి వారిని అభిషేకాలు, పూజలతో అర్చించి తరించడం జరిగింది.ఈ శుభ సమయం లోనే ఆ మహా భక్తుడు ఆ మహాదేవుని ఆజ్ఞ గా తలంచి ఈ ఆలయ పునర్నిర్మాణానికి దాత గా అగీకరించడం జరిగింది.ఈ విధంగా ఈ ఆలయ పునర్నిర్మాణానికి భక్తులు నరేష్ కుమార్, శేకర్ రెడ్డి మరియు కొందరు గ్రామ భక్తుల అండతో శ్రీ వెంకటేశ్వర్ రావు దంపతుల చేతుల మీదుగా శ్రీకారం జరిగింది.
శంకర్ పల్లి గ్రామ వాస్తవ్యులైన శ్రీ వెంకటేశ్వర్ రావు ఒక గొప్ప దాత. ధనం ఎంతో వున్నా దానం చేసే సహృదయం కొందరికి మాత్రమే వుంటుంది. అలాంటి వారిలో శ్రీ వెంకటేశ్వర్ రావు మరియు ఉమారాణి దంపతులు కుడా ఒకరు.శంకర్ పల్లి లోని పలు దేవాలయాల కు విగ్రహాలను మరియు నిర్మానానికి మంచి మనసుతో ఎన్నో భారీ విరాళాలను ఇచ్చిన గొప్ప దాత.
అంతే కాకుండా భాదలలో వున్న ఎంతో మంది నిర్బాగ్యులను కుడా ఆదుకొన్న మంచి మనసున్న ఒక గొప్ప మానవతా వాది.